బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ ప్రతిష్టాత్మక బయోపిక్‌లలో ముఖ్య పాత్ర పోషిస్తూ వస్తుంది. పెళ్లి అయిన తర్వాత హీరోయిన్స్ కాస్త జోరు తగ్గిస్తారు. కాని విద్యాబాలన్ మాత్రం వరుసగా చిత్రాలు చేస్తూ దూసుకు పోతుంది. ఈమె కొన్నాళ్ల క్రితం సిల్క్ స్మిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన డర్టీపిక్చర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సిల్క్ డర్టీ జీవితాన్ని విద్యాబాలన్ వెండి తెరపై ఆవిష్కరించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్‌లో బసవతారకం పాత్రలో కనిపించబోతుంది. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో చాలా హుందా అయిన పాత్రలో విద్యాబాలన్ కనిపించబోతుంది. ఎన్టీఆర్ చిత్రం మొత్తం కూడా విద్యాబాలన్ పాత్ర చుట్టు తిరుగుతుందని సినీ వర్గాల వారు అంటున్నారు.
బసవతారకం పాత్ర తర్వాత విద్యాబాలన్‌ను తమిళనాడు ప్రజల అమ్మ జయలలిత పాత్ర వరించింది. హీరోయిన్‌గా, రాజకీయ నాయకురాలిగా, సుదీర్ఘ కాలం సీఎంగా పని చేసిన వ్యక్తిగా జయలలితకు ఒక అరుదైన చరిత్ర ఉంది. ఆ చరిత్రను వెండి తెరపై ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జయలలిత బయోపిక్‌ను ‘ఎన్టీఆర్’ చిత్రానికి ఒక నిర్మాత అయిన విష్ణు నిర్మించబోతున్నాడు. అందుకే ఆ చిత్రంలో విద్యాబాలన్‌ను నటింపజేసేందుకు ఒప్పించినట్లుగా సమాచారం అందుతుంది. జయలలిత పాత్ర కోసం ఎంతో మందిని పరిశీలించిన దర్శకుడు విజయ్ చివరకు విద్యాబాలన్ అయితే అన్ని విధాలుగా బాగుంటుందనే అభిప్రాయంకు వచ్చాడు. విద్యాబాలన్‌తో అమ్మ బయోపిక్ తీస్తే బాలీవుడ్‌లో కూడా మంచి మార్కెట్ అవుతుందనేది వారి ఉద్దేశ్యం. మొత్తానికి విద్యాబాలన్ చేస్తున్న సినిమాలు ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.