వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ తనకు అవసరం లేదనుకున్న, అవసరం తీరదు అనుకున్న నేతల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇది ముందు నుండీ పార్టీ కోసం శ్రమిస్తున్న వారిని సైతం కరివేపాకులా పక్కన పడేయడం దాకా వెళుతోంది. అయితే కాపు జాతి మొత్తం తమ నేతగా భావించే వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ విషయంలోనూ ఆయన వ్యవహార శైలి పార్టీలోని నేతల్నే ఆశ్చర్య పరుస్తోంది. ఇచ్చాపురంలో ముగియనున్న పాదయాత్ర ముగింపులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు పార్టీకి చెందిన నియోజకవర్గాల సమన్వయకర్తలతో పాటు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ముఖ్య నేతలు అన దగ్గ వారందరికీ ఆహ్వానం పంపారు. పార్టీ తరపున చేపట్టాల్సిన కార్యక్రమాలు ముగింపు సభ సందర్భంగా ఇచ్చాపురంకు జనాన్ని తీసుకు రావాల్సిన టార్గెట్లు కూడా పెట్టారు.
దాదాపు ఫాంలో ఉన్న అందరు నాయకులని పిలిచారు కానీ వంగవీటి రాధాకృష్ణకు కనీసం సమాచారం కూడా పంపలేదు. విజయవాడకు చెందిన వైసీపీ చోటా నేతలందరికీ రాధాతో వివాదం పెట్టుకున్న గౌతంరెడ్డికి కూడా ఆహ్వానం వచ్చినప్పటికీ వంగవీటిని మాత్రం జగన్ నిర్లక్ష్యం చేశారు. నిన్నా మొన్నటి వరకూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సమన్వయకర్తగా ఉన్న వంగవీటి రాధాకృష్ణను అకస్మాత్ గా తొలగించి మల్లాది విష్ణుకు పదవి ఇచ్చారు. ఆయననే అభ్యర్తిగా ఖరారు చేశారు. వంగవీటి రాధాకృష్ణని బందరు పార్లమెంట్ ఇస్తాననడంతో అప్పటి నుండి వైసీపీతో అంటీ ముట్టనట్లు ఉంటున్నారు. కోడలి నాని ఒకరు వంగవీటిని బుజ్జగించే ప్రయత్నం చేసినా అది ఫలించలేదు. దీంతో ఆయన్ని పక్కన పెట్టేయాలని జగన్ భావిస్తున్నారట. అందుకే జగన్ లైట్ తీస్కున్నారట. అయితే ఇక ఆయనకు మిగిలిన ప్రత్యామ్నయం రెండే పార్టీలు ఒకటి తెలుగుదేశం, మరొకటి జనసేన. టీడీపీ వంక ఎటూ చూసే పరిస్థితి లేదు కాబట్టి ఇక మిగిలిన ఏకైన అవకాసం జనసేన మాత్రమే.