వైఎస్ జగన్ తను నమ్మిన క్రీస్తును ప్రార్థించడానికి చాలా చోట్ల చర్చిలకు వెళ్తారు. ఎక్కడా ఆయన అనుచరులు చుట్టుముట్టి చర్చిల్లోకి తోసుకెళ్లే సన్నివేశాలు కనిపించవు. కానీ ఒక్క తిరుమలలో మాత్రం.. ఆయన వెంట వస్తారో.. కావాలని తీసుకు వస్తారో కానీ వందల మంది ఆలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆయన చర్చిల్లో ప్రార్థనలు చేసుకుంటున్నప్పుడు అక్కడ అంతా ప్రశాంత వాతావరణం ఉంటుంది. కానీ తిరుమలలో మాత్రం నిషేధం ఉన్నా అవేమీ పట్టకుండా జైజగన్ నినాదాలు హోరెత్తిపోతాయి. దానికి జగన్ చిరునవ్వుల మొహం తోడవుతుంది. అసలు శ్రీనివాసుని నామజపం మాత్రమే చేయాల్సిన చోట జైజగన్ నినాదాలు ఎందుకు వినిపిస్తున్నాయి. అసలు కొన్ని వందల మందిని వెంటేసుకుని కొండపైకి రావాల్సిన అవసరం ఇప్పుదేమోచ్చ్హింది.
నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు శ్రీవారిపై మనస్ఫూర్తిగా నమ్మకం లేదు. ఆ విషయం ఆయన అనేక మార్లు డిక్లరేషన్లు ఇచ్చే సందర్భంలోనే బయటపెట్టుకున్నారు. శ్రీవారిపై సంపూర్ణ నమ్మకంతోనే దర్శనానికి వచ్చినట్లు అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన ఎప్పుడూ ఇవ్వలేదు. ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఆయన క్రిస్టియన్ ఇది జగమెరిగిన సత్యం. ఆ మతాచారాలనే గొప్పగా విశ్వసిస్తారు. అందులో తప్పు లేదు. ఎవరి విశ్వాసం వారిది. కానీ మరో మతానికి చెందిన ఆలయానికి వెళ్లి అక్కడి దేవుడ్ని కొలవాలనుకున్నప్పుడు కచ్చితంగా నమ్మకం ఉంచాలి. లేకపోతే అది ఓట్ల కోసం ఆడే రాజకీయమే అవుతుంది. అంటే జగన్ చేసేది కేవలం రాజకీయ యాత్ర. హిందువుల ఓట్ల కోసం తప్ప శ్రీవారిపై నమ్మకం ఉండి కాదు. ఇంకా విచిత్రం ఏంటంటే ఒక్క జగన్ మాత్రమే కాలి నడకన వెళ్లినట్లుగా జగన్ మీడియా విస్త్రతంగా ప్రచారం చేస్తోంది. కానీ లెక్కల ప్రకరం రోజుకు కాలి నడకన కనీసం 30 వేల మంది తిరుమలకు వెళ్తారని చెబుతున్నాయి. మరి ఈ హడావిడి దేనికో వెంకన్నకే ఎరుక.