Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2014 ఎన్నికల్లో వైసీపీ పొందిన పరాజయం ఆ పార్టీ అధినేత జగన్ కి జీర్ణం కాలేదు. అందుకే ఆయన పదేపదే ఈ గవర్నమెంట్ ఎన్నాళ్ళో ఉండదు అని చెప్పుకొచ్చారు. ఆపరేషన్ ఆకర్ష్ సహా కొన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ 2019 లో ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తానన్న నమ్మకం జగన్ కి ఉండేది. అయితే నంద్యాల, కాకినాడ ఫలితాలు చూసాక జగన్ లో ఆ నమ్మకం సడలింది. అందుకే తమని గెలిపించే దారులు వెదికే పనిలో పడ్డారు. ఈ ప్రయత్నాల్లో భాగం గా కొత్తగా కనిపిస్తున్న దృశ్యం ఏమిటంటే పీఠాధిపతులు, స్వామీజీలతో జగన్ భేటీ. అంతకు ముందు ఈ కోవలో చేసిన ఇంకో కాపు రిజర్వేషన్ ఉద్యమానికి ఊపిరులు ఊదడం. అంటే జనం ఇంకా కులం, మతం చుట్టూ మాత్రమే ఆలోచించి తమ ఓటు వేస్తారన్న ఆలోచన నుంచి జగన్ బయటికి రాలేదు అనుకుంటా. అదే నిజం అయితే 2014 ఎన్నికల్లో సామాజిక సమీకరణాలు జగన్ కి అనుకూలంగానే వున్నాయి. కానీ గెలుపు చంద్రబాబుని వరించింది. కారణం… కష్టాల్లో వున్న రాష్ట్రానికి ఆయన అనుభవం పనికొస్తుందన్న నమ్మకం. అసలు ఈ కోణంలో ఆలోచిస్తే జనాన్ని ప్రభావితం చేసే అంశాల్లో కుల, మత ప్రభావం తగ్గిందని అర్ధం అవుతుంది.
ఇప్పుడు కూడా జగన్ ఇంకా కుల, మత ప్రాతిపదికన రాజకీయాలు చేయడం చూస్తుంటే జాలిగా వుంది. నిజానికి కొత్త తరం నాయకుడంటే కొత్త ఆలోచనలతో రావాలి. అలా గాకుండా ఎంతసేపు చంద్రబాబు మీద ఆరోపణలు, ప్రభుత్వ వైఫల్యాలలకే పరిమితం అయితే ప్రయోజనం ఉండదు. తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో, ఎలా చేస్తామో చెప్పగలగాలి. ఆ విషయంలో కూడా జగన్ ప్రకటించిన నవరత్నాలు కూడా పాత చింతకాయ పచ్చడి వ్యవహారమే. వై.ఎస్ హయాంలో ఆరోగ్యశ్రీ, ఫీజు రీ ఎంబెర్సెమెంట్ పెద్ద సంచలనం. అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు, ప్రజల ఆలోచనా విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్త అండ కూడా వుంది కాబట్టి జనం అవసరాలు, ఆలోచనలకి తగినట్టు మేనిఫెస్టో రూపొందించుకుంటే మంచింది. అలా కాకుండా జనం కులం, మతం చూసి మాత్రమే ఓటు వేస్తారు అనుకుని వాటి చుట్టూ పరిభ్రమిస్తే ఇంకోసారి నిరాశ తప్పదు.






