Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా డిమాండ్ తో వైసీపీ అలుపెరగని పోరాటం చేస్తోందా ? ఔనట… ఆ పార్టీ అధినేత జగన్ ఇటీవల అనంతపురం యువభేరీలో విద్యార్ధులకి పరీక్షలు, సెలవులు వున్నాయి కాబట్టి హోదా పోరాటం తాత్కాలికంగా ఆపానని చెప్పారు. ఓ పక్క బీజేపీ కి కన్ను కొడుతూ హోదా పోరాటాన్ని పక్కనబెట్టిన జగన్ ఈ మాటలు చెబుతుంటే అంతా నవ్వుకుంటున్నారు. కాస్త ఆలస్యంగా ఈ విషయం వైసీపీ కి కూడా అర్ధం అయ్యింది. అందుకే ప్రత్యేక హోదా కోసం తాము చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నట్టు చెప్పుకోవాల్సిన అవసరం పడింది.
ఈ పరిస్థితుల్లో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఓ కేసుకి సంబంధించి కోర్టు సమన్లు అందాయి. ఇంతకీ కేసు ఏమిటంటే… 2015 , ఆగష్టు 29 న మంగళగిరిలో ప్రత్యేక హోదా డిమాండ్ తో బంద్ నిర్వహించారు. అది కూడా వైసీపీ అధినేత జగన్ ఆదేశాల ప్రకారం చేశారట. ఆ బంద్ కి సంబంధించి ఎమ్మెల్యే ఆర్కే సహా 15 మంది మీద పోలీసులు కేసులు పెట్టారు. ఆ కేసుకి సంబంధించి నేడు కోర్టు సమన్లు అందాయి. నవంబర్ 13 న ఈ కేసు విచారణలో భాగంగా ఆర్కే కోర్టులో హాజరు కానున్నారు. అయితే చిత్రం ఏమిటంటే కోర్టు సమన్లు అందుకుంటున్న ఫోటోలు తీస్తూ దాన్ని మీడియాకి పంపారు. ఇందు మూలంగా వైసీపీ ప్రత్యేక హోదా పోరాటం చేస్తుందని ప్రపంచానికి చాటి చెప్పమని జర్నలిస్టులకి ఫోన్ చేసి మరీ కోరారు. అదండీ వైసీపీ చేస్తున్న హోదా పోరాటం. నమ్మితే నమ్మండి.