ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ఇప్పటికే ఒక ఎమ్మెల్యే షాక్ ఇవ్వగా తాజాగా ఆ పార్టీకి మరో షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. విశాఖ ఉత్తర బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తా కానీ.. ఏ పార్టీ నుంచో మాత్రం ఇప్పుడే చెప్పనని ప్రకటించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత తను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో ప్రకటిస్తారట. వాస్తవానికి ఏపీలో బీజేపీ పరిస్థితి బాగోలేదు, ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని ఆయన చెప్పడాన్ని బట్టి చూస్తే ఆయన బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశం లేదని మాత్రం చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి విష్ణుకుమార్ రాజు వ్యవహారశైలి బీజేపీ నేతలకు తలనొప్పిగానే ఉంది.
ఒక్కోసారి బీజేపీ చాలా గొప్పగా సమర్థించే ఆయన ఆ తర్వాత రోజే చంద్రబాబును ఆకాశానికెత్తేస్తారు. ఆ తర్వాత మళ్లీ జగన్ వంతు వస్తుంది. పొగడ్తలే కాదు వరుసగా విమర్శలు కూడా చేస్తూ ఉంటారు. విష్ణుకుమార్ రాజు రాజకీయ భవిష్యత్ కోసం ఇతర పార్టీల వైపు చూస్తూనే ఉన్నారని ప్రచరం సాగింది. ఆయన టీడీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ టీడీపీలో చేరడానికి విశాఖ నుంచి చాలా మంది సీనియర్ నేతలు లైన్లో ఉన్నారు కాబట్టి విష్ణుకుమార్ రాజుకు టీడీపీ అవకాశం ఇవ్వడం కష్టమే. ఇప్పటికే విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి సబ్బం హరి పేరు టీడీపీ తరపున వినిపిస్తోంది. మరి ఈయన ఏ పార్టీ తరపున ఎక్కడ పోటీ చేస్తారో ?