వృత్తి ఫిలిం క్రిటిక్ అని చెప్పుకునే కత్తి మహేష్ ఆ విధంగా కన్నా, పవన్ వ్యతిరేకిగానే తెలుగోళ్ల నోళ్ళలో తెగ నానారు. పవన్ ఫాన్స్ ఎంత దాడి చేసినా కత్తి మహేష్ ఎదురు నిలిచిన విధానం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. అయితే కత్తిని చూసిన వాళ్ళు ఆయన వెనుక ఎవరో వున్నారని లేక ఏదో బలమైన కారణంతో ఆయన ఇలా ప్రవర్తిస్తున్నారని భావించారు. ఆ రెంటిలో ఏది నిజమో అనే చర్చకు తావు లేకుండా తాజాగా కత్తి మహేష్ తన మనసులో మాట బయటపెట్టాడు. తనకు రాజకీయ లక్ష్యాలు ఉన్నాయని, అయితే ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కావడం ఇష్టం లేదని చెప్పారు. సొంత జిల్లా చిత్తూరు లో ఎంపీ గా పోటీ చేయాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తపరిచారు. అయితే ఏ పార్టీ తరపున అన్న విషయంలో మాత్రం చిన్నపాటి సస్పెన్స్ కొనసాగించే ప్రయత్నం చేశారు.
పాలక పక్షం టీడీపీ విధానాలు నచ్చడం లేదని చెప్పిన కత్తి మహేష్ కాంగ్రెస్ లేదా వైసీపీ నుంచి పోటీ చేసే ఆలోచన ఉందన్నారు. ( జనసేన ని కత్తి, కత్తిని జనసేన పక్కనబెట్టాయి ). అయితే ప్రస్తుతం వున్న రాజకీయ పరిస్థితుల్లో కత్తి కన్ను కాంగ్రెస్ కన్నా వైసీపీ మీద ఉందని తెలుస్తోంది. అయితే నేరుగా ఆ విషయం చెబితే వైసీపీ అధిష్టానం ఎలా తీసుకుంటుందో అన్న భయంతో కత్తి ఈ ఫీలర్లు వదిలినట్టు తెలుస్తోంది. అయితే కత్తికి వైసీపీ నుంచి చిత్తూరు ఎంపీ టికెట్ దక్కడం అంత తేలిక అయితే కాదు. ఇంతకు ముందు అక్కడ నుంచి పోటీ చేసిన సామాన్య కిరణ్ కుటుంబం కి జగన్ తో మంచి సంబంధాలున్నాయి. ఇక కత్తిని పోటీకి దింపితే పవన్ ఫాన్స్ దూరం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ నియోజకవర్గంలో పవన్ సామాజిక వర్గం కూడా పెద్ద సంఖ్యలో ఉండడంతో అది కూడా కీలక అంశమే. ఇక ఆర్ధిక బలం రీత్యా కూడా సామాన్య కిరణ్, కత్తి కన్నా మెరుగైన అభ్యర్థి. ఇన్ని ప్రతికూల పరిణామాల మధ్య కత్తిని జగన్ కరుణింస్తాడో, లేదో చూడాలి.