Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
లక్ష్మీస్ వీరగ్రంథం మూవీతో తెలుగు నాట హాట్ టాపిక్ అయిన కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ వార్తల్లో వ్యక్తిగా మారబోతున్నాడు. దీనికి కారణం తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితంపై సినిమా తీస్తానని ప్రకటించడమే. జయలలిత, శశికళ స్నేహం ఆధారంగా ఓ సినిమా తీయబోతున్నానని, ఆ చిత్రానికి శశిలలిత అనే టైటిల్ ఖరారుచేశానని కేతిరెడ్డి ప్రకటించారు. సినిమాకు దర్శకత్వ, నిర్మాణ బాధ్యతల్ని తానే వహిస్తానని చెప్పారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని, త్వరలో సెట్స్ పైకి వస్తుందని తెలిపారు. జయలలిత జీవితంలో శశికళ ప్రవేశం మొదలుకుని జయ చివరిరోజుల్లో అంటే 2016 సెప్టెంబరు నుంచి ఆమె మరణించిన డిసెంబర్ 5 వరకు జరిగిన ప్రతి ఘటన శశిలలిత సినిమాలో ఉంటుందన్నారు.
ఈ సినిమా తీస్తే తన అంతు చూస్తానని శశికళకు చెందని మన్నార్ గుడి మాఫియా హెచ్చరించిందని చెప్పారు. అయితే జయ బతికిఉన్నప్పుడే తెలుగు భాషకు తమిళనాడులో జరుగుతున్న అన్యాయంపై ఎదిరించానని, అప్పుడే తనను ఏ శక్తీ ఏమీ చేయలేకపోయిందని, ఇప్పుడు ఎవరూ ఏమీ చేయలేరని కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తాను తీస్తున్న లక్ష్మీస్ వీరగ్రంధంలో లక్ష్మీపార్వతి పాత్రలో పూజాకుమార్ నటిస్తున్నారని తెలిపారు.
జయలలిత, శశికళ పాత్రల కోసం త్వరలోనే హీరోయిన్స్ ను ఎంపికచేస్తామన్నారు. తాను తీస్తున్న లక్ష్మీస్ వీరగ్రంధం, శశిలలిత సినిమాలు రెండూ ఒకే తరహాకు చెందినవని ఆయన చెప్పారు. లక్ష్మీపార్వతి జీవితం, శశికళ జీవితం ఒకటేనన్నారు. సేవకురాళ్లుగా ఇతరుల జీవితంలోకి ప్రవేశించిన వారు.. ఎలా చక్రం తిప్పారన్న ఇతివృత్తమే ఈ రెండు సినిమా కథలని అభిప్రాయపడ్డారు. లక్ష్మీపార్వతి, శశికళ ఇద్దరి లక్ష్యం రాజ్యాధికారం మాత్రమే అనే అంశాలతో తీయనున్న సినిమాలని కేతిరెడ్డి తెలిపారు. రెండు సినిమాల్లో సమకాలీన రాజకీయాలు, యదార్థ సంఘటనలను చూపిస్తామని చెప్పారు.