నటీనటులు: ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్, వెన్నెల కిషోర్
దర్శకుడు:హరినాథ్
నిర్మాత:కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎం.వి.వి.
సినిమాటోగ్రఫీ:సాయిశ్రీరామ్
సంగీతం:ప్రసన్
ఈ తరం నటుల్లో నటనకి, కొత్తదనానికి ప్రాధాన్యం ఇస్తున్న కధానాయకుల్లో అది పినిశెట్టి ఒకరు. తెలుగులో కొత్త తరహా సినిమాలు చేయడానికి అతను చేస్తున్న ప్రయత్నాలు చూస్తూనే వున్నాం. అయితే అతను ఇతర హీరోల చిత్రాల్లో వేస్తున్న పాత్రలకు లభిస్తున్న ఆదరణ, సొంతంగా కథానాయకుడిగా వేస్తున్నప్పుడు రావడం లేదు. ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఆది పినిశెట్టి ఎంచుకున్న ఇంకో సినిమా” నీవెవరో “. ఈ సినిమా అయినా ఆది ఆశలకు తగినట్టు వుందో, లేదో చూద్దాం.
కథ…
కళ్యాణ్ కి చిన్న తనంలోనే కళ్ళు పోతాయి. అయితే నిండైన ఆత్మవిశ్వాసంతో మంచి చెఫ్ గా ఎదిగి ఓ రెస్టారెంట్ నడుపుతుంటాడు. అతని పక్కింట్లో వుండే అను కి కళ్యాణ్ తో స్నేహంతో పాటు ప్రేమ పెంచుకుంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా కళ్యాణ్ , అను ల పెళ్ళికి ఒప్పుకుంటారు. అదే సందర్భంలో ఓ అర్దరాత్రి వెన్నెల అనే అమ్మాయి అనూహ్యంగా అతన్ని కలుస్తుంది. ఆమె ప్రవర్తన చూసి కళ్యాణ్ ప్రేమలో పడతాడు. ఆమెకి ఐ లవ్ యు చెబుతాడు. ఇంతలో ఆమె ఓ పెద్ద ప్రమాదంలో ఉన్నట్టు తెలుసుకున్న కళ్యాణ్ దాని నుంచి బయటపడేస్తానని వెన్నెలకి ప్రామిస్ చేస్తాడు. అయితే ఆ రాత్రి జరిగిన ఓ ప్రమాదంతో మూడు వారాల పాటు అతను హాస్పిటల్ లో ఉండాల్సి వస్తుంది. అప్పుడు జరిగిన ఆపరేషన్ తో కళ్యాణ్ కి చూపు కూడా వస్తుంది. కానీ అతను ఎంతగానో ఇష్టపడ్డ వెన్నెల కనిపించకుండా పోతుంది. ఆమెకి ఏమి జరిగింది ? కళ్యాణ్ జీవితం ఎన్ని మలుపులు తిరిగింది అన్నదే మిగిలిన కథ.
విశ్లేషణ…
కొత్త తరహా కధలు చేయాలన్న తహతహ వున్న హీరోలకు ఓ కొత్త పాయింట్ తో కథ చెప్పి ఒప్పించడం ఓ ఎత్తు అయితే అందుకు తగ్గ కధనం రాసుకుని ప్రేక్షకుల్ని మెప్పించడం అంతకు మించిన పని. ఈ విషయంలో కొత్త దర్శకుడు హరినాధ్ తడబడ్డాడు. కథానాయకుడిని అంధుడిగా చూపించడం, తర్వాత కళ్ళు రావడం వంటి పాయింట్స్ కధలో ముఖ్య భాగం అయినప్పుడు కధనంలో దానికి ఇచ్చిన ప్రాధాన్యం పెద్దగా లేదు అనిపిస్తుంది. పైగా సినిమా ఎత్తుగడలోనే స్క్రీన్ ప్లే పరంగా ఇంకో పెద్ద తప్పు జరిగింది అనిపిస్తుంది. ప్రముఖ కధారచయిత పరుచూరి వెంకటేశ్వరరావు చాలా సందర్భాల్లో సస్పెన్స్ , సెంటి మెంట్ ఒకే ఒరలో ఇమడవు అన్న విషయం గురించి చెప్పారు. కానీ ఈ సినిమాలో అవే ఎలిమెంట్స్ తో దర్శకుడు ముందుకు వెళ్లడంతో సినిమా ఏ జానర్ అన్నది తెలియకుండా పోయింది. ప్రేమ, సస్పెన్స్ కలగలిపిన సీన్స్ ఒకదాని వెంట ఇంకోటి వస్తుంటే సగటు ప్రేక్షకుడు దేన్నీ కూడా పూర్తిగా ఆస్వాదించలేని పరిస్థితి. ఇక సెకండ్ హాఫ్ లో అయినా కధనం పరుగులు తీస్తుంది అనుకుంటే ఇంకా నత్తనడక నడిచింది. సస్పెన్స్ ఎలిమెంట్ తెలిసిపోయాక కూడా కధనంలో స్పీడ్ కనిపించలేదు. పైగా విలన్ గ్యాంగ్ వెంట హీరో పరుగులు తీయడం తప్ప చేస్సేదేమీ ఉండదు. రెండో అర్ధ భాగంలో వెన్నెల కిషోర్, సప్తగిరి కామెడీ ట్రాక్ కొంతలో కొంత నయం.
అమ్మయిలు ప్రేమ పేరుతో మోసం చేసే పాయింట్ ని టచ్ చేస్తున్నప్పుడు లవ్ సీన్స్ లో ఇంటెన్సిటీ ఉండాలి. కానీ ఇక్కడ అంతా కృతకం అనిపిస్తుంది. ఈ సినిమాలో నటీనటులు బాగానే చేసినప్పటికీ సీన్స్ లో డెప్త్ లేకపోవడంతో అంతా తేలిపోతుంది. అది పినిశెట్టి అప్పటికీ బాగా కష్టపడినా ప్రయోజనం లేదు. ఇక తాప్సి చాన్నాళ్ల తర్వాత ఓ తెలుగు సినిమా ఎందుకు ఒప్పుకుంది ? కధలో ఆమెకి వున్న ప్రాధాన్యం అందుకు కారణం. అయితే ఈ పాత్రని ఇంకా బాగా చేసి వుండాల్సింది. సాంకేతిక నిపుణుల వ్యవహారానికి వస్తే సాయి శ్రీరామ్ కెమెరా పనితనం, చిన్న ఆర్ట్ కి ప్రత్యేకత వుంది. కోన వెంకట్ మార్క్ మేజిక్ మాత్రం మిస్ అయ్యింది. సంగీతం ఓకే.
తెలుగు బులెట్ …”నీవెవరో “ తెలిసినా , తెలియకపోయినా ఉత్కంఠ లేదు..
తెలుగు బులెట్ రేటింగ్ …2 / 5 .