ఎన్టీ రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ మరియు ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రాలు వచ్చే ఏడాది జనవరిలో సంక్రాతి మరియు రిపబ్లిక్ డే సందర్బంగా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం పోస్టర్స్ ఇప్పటికే సినిమా స్థాయిని పెంచేశాయి. ఇంకా ఇంకా ఈ చిత్రం స్థాయిని పెంచేందుకు, అంచనాలను పెంచేందుకు చిత్ర యూనిట్ సభ్యులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ రెండు పార్ట్‌లకు సంబంధించిన టీజర్లను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం దీపావళి సందర్బంగా ఈ చిత్రం టీజర్లను విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. రెండు పార్ట్‌లకు సంబంధించిన రెండు టీజర్లు ఒకే రోజున కొన్ని నిమిషాల తేడాతో రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ముందుగా దసరాకు టీజర్లను విడుదల చేయాలని భావించినా కూడా కొన్ని టెక్నీకల్ ఇష్యూల కారణంగా దీపావళికి వాయిదా వేయడం జరిగింది. త్వరలోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది. రికార్డు స్థాయిలో ఈ రెండు చిత్రాలు అమ్ముడు పోతున్న నేపథ్యంలో అదే స్థాయిలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్‌గా బాలకృష్ణ నటిస్తుండగా, చంద్రబాబు నాయుడు పాత్రను రానా, ఏయన్నార్ పాత్రను సుమంత్, శ్రీదేవి పాత్రను రకుల్, బసవతారకం పాత్రను విద్యాబాలన్ పోషిస్తున్నారు.