Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హైదరాబాద్ కేంద్రంగా ఇన్నాళ్లు పార్టీ కార్యకలాపాలు నిర్వహించిన వైసీపీ ఇకపై ఏపీలోకి అడుగుబెట్టబోతోంది. ఈ విషయంలో ఏళ్ళకొలదీ సాగదీతకు తెర పడింది. చివరకు ఈ విషయం లోను పార్టీ ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ ప్రమేయం తప్పలేదు. కార్యక్షేత్రం ఏపీ లో పార్టీ కార్యాలయం లేకపోవడం భారీ లోపమని ప్రశాంత్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఆయన సూచనకి అనుగుణంగా విజయవాడ, మంగళగిరి ప్రాంతాల్లో పార్టీ కార్యాలయం కోసం కొన్ని స్థలాలు, భవనాలు చూసారు. వీటిలో ఏది ఫైనల్ చేయాలన్నదానిపై ప్రశాంత్ కే నిర్ణయం వదిలిపెట్టారట. పార్టీ నేత, జగన్ బాబాయ్ వై.వి. సుబ్బారెడ్డి తో కలిసి అన్ని చోట్లకు వెళ్లిన ప్రశాంత్ కిషోర్ చివరకు బందర్ రోడ్ లో స్వరాజ్ మైదాన్ ఎదుట వైసీపీ నేతకి చెందిన ఓ ఖాళీ స్థలాన్ని ఎంపిక చేశారు. ఇందులో శాశ్వత భవన నిర్మాణం చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది కాబట్టి తక్కువ టైం లో పూర్తి అయ్యేలా ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ తో నిర్మాణం చేయబోతున్నారట. ఇలా చేస్తే 45 రోజుల్లో పార్టీ కార్యాలయ నిర్మాణం పూర్తి అవుతుందట. ఆగస్టు నెలాఖరుకి ఈ నిర్మాణం పూర్తి చేసి మంచి ముహూర్తంతో జగన్ ఇక్కడ అడుగు పెట్టబోతున్నారట. మరోవైపు జగన్ నివాసం కోసం తాడేపల్లిలో ఓ భవనాన్ని చూసినట్టు తెలుస్తోంది.
జగన్ ఏపీ లో పార్టీ కార్యాలయం మొదలుబెట్టడం మంచి పరిణామమే అయినా దాన్ని సెలెక్ట్ చేయడానికి కూడా ప్రశాంత్ కిషోర్ మీద జగన్ ఆధారపడటం ఆయనలో అభద్రతా భావాన్ని సూచిస్తోంది. 2019 లో గెలుపు దక్కకపోతే వైసీపీ మూతపడటం ఖాయమని అందరికన్నా జగన్ ఎక్కువగా నమ్ముతున్నట్టున్నారు. అందుకే సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రశాంత్ ని ఎన్నికల వ్యూహానికి నియమించుకున్నారు. ప్రశాంత్ రంగంలోకి దిగాక ఇవన్నీ బయటికి తెలుస్తున్నాయి కానీ పార్టీలు కొందరు వ్యూహకర్తల మీద ఆధారపడటం కొత్తేమీ కాదు. కాంగ్రెస్ హయాంలో కొందరు సీనియర్ నేతలు, ఐఏఎస్ లు కూడా తమ పేర్లు బయటికి రాకుండా ఈ వ్యవహారాలు చక్కబెట్టేవారు. ఇక బీజేపీ విషయానికి వస్తే rss నేతలు ఏ స్థాయిలో కష్టపడతారో తెలియంది కాదు. అయినా ఒకరిద్దరు పేర్లు తప్ప వ్యూహకర్తలు చాలా మంది బయటికి తెలియదు. ఇక జగన్ తండ్రి వై.ఎస్ కి కేవీపీ చేసిన పని ఏమిటి? అయినా వీళ్ళలో ఎవరికీ రాని ప్రచారం ప్రశాంత్ కి తెప్పిస్తోంది వైసీపీ. అంటే తమ ఆలోచనలు, బలం మీద నమ్మకం కన్నా ప్రశాంత్ వ్యూహాల మీద విశ్వాసం ఎక్కువ ఉందన్న సంకేతాలు ఇప్పటికే జనంలోకి వెళ్లిపోతున్నాయి. అందుకే ప్రత్యర్ధులు ఇప్పటికే ప్రశాంత్ ని టార్గెట్ చేయడం మొదలెట్టారు. ప్రత్యర్ధులు అంటే ఎదుటి పార్టీలు మాత్రమే కాదు. వైసీపీ లోని సీనియర్ నేతలు ఎందరో ప్రశాంత్ ని శత్రువు గానే చూస్తున్నారు. ఇదంతా ప్రశాంత్ గొప్పదనం కాదు. జగన్ బలహీనత మాత్రమే. మంత్రి సలహాలు మాత్రమే ఇవ్వాలి. రాజు నిర్ణయాలు తీసుకోవాలి. కానీ పార్టీ ఆఫీస్ నిర్ణయం కూడా ప్రశాంత్ కి వదిలేయడం జగన్ లో నిర్ణయాలు తీసుకోలేని అశక్తతని, భయాన్ని చెప్పకనే చెపుతోంది.
మరిన్ని వార్తలు