ఆరుబయట నిద్రిస్తున్న ఓ యువతిని మద్యం మత్తులో ఎత్తుకెళ్లిన కామాంధుడు అత్యాచారం చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆ యువతి మానసిక వికలాంగురాలు, కావడంతో ఆమె మీద జాలి కూడా చూడకుండా పశువాంఛ తీర్చుకోవడం కలకలం రేపుతోంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని ఓ మారుమూల గ్రామంలో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఓ మానసిక వికలాంగురాలు శనివారం రాత్రి ఇంటి ఆవరణలో నిద్రిస్తోంది. రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో ఓ కామాంధుడు ఆ యువతిని బలవంతంగా నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. మద్యం మత్తులో ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. నిద్ర నుంచి మేల్కొన్న యువతి కుటుంబ సభ్యులు ఆమె లేకపోవడం గమనించి ఆందోళనకు గురయ్యారు. గ్రామస్థులతో కలిసి ఆమె కోసం తీవ్రంగా గాలించారు. చివరికి ఊరు శివారులో ఓ చోట ఆమె కదలలేని స్థితిలో ఉండటం గమనించారు. ఆ పక్కనే పడి ఉన్న కామాంధుడిని పట్టుకొని చితకబాదారు. అనంతరం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.