Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది. ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేసినా అది ఏ విషయం అయినా కూడా అవ్వాల్సిందే. ఇటీవల ట్విట్టర్‌ను డీయాక్టివేట్ చేసి కాస్త సందడి తగ్గించిన రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో ప్రస్తుతం డ్రగ్స్ ఇష్యూపై మీడియా మరియు ప్రేక్షకుల కామెంట్స్‌పై స్పందించాడు. సినిమా వారు అంటే జనాలకు మరీ చులకన అయ్యిందని, సినిమా వారి పరిస్థితి ఎలా తయారు అయ్యిందో చెప్పేందుకు ప్రముఖ రచయిత సిరాశ్రీ ఒక రచన చేశాడు. దాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్మ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. అది మీకోసం…
మనకి సినిమావాళ్లు కావాలి:
ఫేసుబుక్కులో
నాలుగు లైకులు కొట్టించుకోవడానికి
సినిమావాళ్లతో ఫోటో కావాలి;
కొత్తగా షాప్ పెట్టుకుంటే
దాని ఓపెనింగ్ కి
సిమిమావాళ్లు కావాలి;
ఇంట్లో పెళ్లి గురించి
నలుగురూ చెప్పుకోవాలంటే
సినిమావాళ్లు రావాలి;
స్కూలు, కాలేజీ ఫంక్షన్లకి
ఊపు రావాలంటే
సినిమావాళ్లు కావాలి;
కానీ సమాజం భ్రష్టు పడుతోంది
అని అనిపించినప్పుడల్లా
మన ఛీత్కారాలన్నీ
సినిమావాళ్లకే పోవాలి.
వాళ్ల ఆవేదన
వాళ్ల ఆక్రందన
వాళ్ల విషాదం
వాళ్ల భయం
వాళ్ల కష్టం
వాళ్ల నష్టం
వాళ్ల బాధ-
ఏదైనా సరే
మనకి వినోదమే!
అవును
మనలో ఉన్న ఆ శాడిజానికి
మనమే దండేసుకోవాలి!
అందుకే-
మన యూట్యూబ్ హిట్స్ కి
సినిమావాళ్లు కావాలి;
మన చానల్ టీ.ఆర్.పీ లకి
సినిమావాళ్ళు కావాలి-
నవ్వుతూ అయినా,
ఏడుస్తూ అయినా,
సజీవంగా అయినా,
జీవచ్ఛవంగా అయినా,
శవంగా అయినా-
ఎలాగైనా పర్లేదు
మనకి సినిమావాళ్లు కావాలి.
సినిమావాళ్లంటే
పబ్లిక్ గార్డెన్లో పువ్వులు-
ముచ్చటేస్తే పొగిడేస్తాం
అవకాశమొస్తే కోసేస్తాం
ఏమీ తోచకపోతే నలిపేస్తాం…
ఇలా
ఏదో ఒకటి చెయ్యడానికి
మనకి సినిమావాళ్లు కావాలి.
– సిరాశ్రీ