తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ప్రధాన పార్టీకి కూడా సొంతంగా మీడియా సంస్థ ఉండాలి అనేది ఒక రూలు అన్నట్లుగా వస్తుంది. తెలుగు దేశం పార్టీకి ఆ రెండు మీడియా సంస్థలు మద్దతుగా ఉంటాయి అనేది ప్రతి ఒక్కరికి తెల్సిందే. ఇక వైకాపాకు సాక్షి టీవీ ఎలాగూ ఉంది. తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్కు ప్రత్యేకంగా టీ న్యూస్ మరియు నమస్తే తెలంగాణ పేపర్ ఉంది. అందుకే ప్రతి పార్టీకి కూడా సొంతంగా మీడియా సంస్థలు ఉండాలని భావిస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఏపీలో సత్తా చాటాలని చూస్తున్న జనసేన పార్టీకి కూడా మీడియా సంస్థ ఉండాలనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
టీవీ9 మరియు ఎన్టీవీలు జనసేనకు మద్దతుగా ఉంటాయని మొదట అంతా భావించారు. ఆమద్య రవిప్రకాష్ మరియు నరేంద్ర చౌదరిలతో పవన్ భేటీ అవ్వడంతో ఆ రెండు ఛానెల్స్ పవన్‌కు మద్దతుగా ఉంటాయని, పవన్‌కు మరో ఛానెల్ అవసరం లేదని భావించారు. కాని అనూహ్యంగా ఆ రెండు ఛానెల్స్ కూడా అధికార పార్టీకి అండగా ఉండి పవన్‌పై విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ సన్నిహితుడు అయిన తోట చంద్రశేఖర్ 99 టీవీ ని కొనుగోలు చేయడం జరిగింది.
99 టీవీని మొదట సీపీఐ పార్టీ వారు స్థాపించారు. ఆ పార్టీ నాయకులు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు, కాని దాన్ని కొనసాగించడంలో విఫలం అయ్యారు. అంతా ఆడవారితోనే ఆ ఛానెల్ నిర్వహించాలని మొదట భావించారు. కాని ఆ తర్వాత అనుకున్నది జరగలేదు. మగవారిని కూడా తీసుకున్నారు. ఛానెల్‌కు అనుకున్న స్థాయిలో గుర్తింపు దక్కక పోవడంతో ఛానెల్లో వర్క్ చేస్తున్న వారికి జీతాలు ఇవ్వడం గగనం అయ్యింది. ఇలాంటి సమయంలోనే తోట చంద్రశేఖర్ ఈ ఛానెల్‌ను తీసుకోవడంతో అందరి దృష్టి ఈ ఛానెల్‌పై మళ్లీంది.
మాజీ ఐఏఎస్ అధికారి అయిన చంద్రశేఖర్ గతంలో ప్రజారాజ్యంలో కీలక భూమిక పోషించారు. ప్రస్తుతం ఈయన జనసేన పార్టీ నుండి ఎంపీ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈయన తీసుకున్న 99 టీవీ ఛానెల్ ఖచ్చితంగా, పూర్తిగా జనసేనకు మద్దతుగా ఉంటుందని, ఇది జనసేన ఛానెల్‌గానే వర్క్ చేస్తుందని అంతా భావిస్తున్నారు. అయితే ఈ ఛానెల్ వల్ల జనసేనకు ఏమేరకు ఉపయోగం ఉంటుందనే విషయంపై పలువురు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగు న్యూస్ ఛానెల్స్ అంటే నాలుగు మాత్రమే చూస్తూ ఉన్నారు అని, ఇది జనసేన ఛానెల్ అని తెలిసిన తర్వాత ఎక్కువ మంది ఆసక్తి చూపించే అవకాశం ఉండదని, దాంతో పార్టీకి పెద్దగా ఒరిగేది ఏమీ లేదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 99 టీవీ ఛానెల్ వల్ల జనసేనకు ఎంత మేరకు ఉపయోగం అనేది కాలమే నిర్ణయిస్తుంది.