Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ అధినేత జగన్ తీవ్ర నిరాశానిస్పృహల్లో మునిగిపోయారు. దీనికి టీడీపీ చేసిన ఎగతాళి కన్నా అయినవాళ్లు అనుకున్నవాళ్ళ సూటిపోటి మాటలే ముఖ్య కారణమంట. జగన్ ని భుజాన ఎత్తుకుని మోసిన ఓ గొప్ప వెబ్ సైట్ ఎన్నికల పరాజయానికి జగన్ భార్య భారతి, ఆమె సన్నిహితురాలు, బంధువు దివ్య రెడ్డి కారణమని చెప్పడానికి ప్రయత్నిస్తోంది.
సాక్షి తో పాటు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పనిని కూడా భారతి, దివ్య రెడ్డి అజమాయిషీ చేసి తప్పుడు సలహాలు ఇస్తున్నందువల్ల నంద్యాల, కాకినాడ ల్లో అపజయం ఎదురైందని సదరు వెబ్ సైట్ ఇచ్చిన కధనం వైసీపీ అభిమానుల్ని కూడా నివ్వెరపరిచింది. జగన్ అనుకూల వాదనలతో రీడర్ షిప్ పెంచుకున్న సదరు వెబ్ సైట్ ఇప్పుడు ఓటమి విషయానికి వచ్చేసరికి ఇలా వ్యవహరించడాన్ని వైసీపీ అభిమానులు కూడా జీరించుకోలేకపోతున్నారు. కష్టాల్లో వున్నప్పుడు సానుభూతి చూపడం లేదా సరైన మార్గనిర్దేశం చేసేలా కధనాలు ఇవ్వాలి కానీ జగన్ భార్యని ఆడిపోసుకోవడం ఎంత వరకు సమంజసమని నిలదీస్తున్నారు. ఈ విషయం ఆనోటాఈనోటా పడి జగన్ దాకా వెళ్లిందట. దీంతో ఆయన తీవ్రంగా బాధపడ్డారట.
నిన్నటిదాకా జగన్ భజన చేసిన సదరు వెబ్ సైట్ ఇలాంటి కధనాలు వండివార్చడం వెనుక కారణాలు ఏమిటా అని ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి. ఆ గొప్ప వెబ్ సైట్ యజమాని తన సంస్థకున్న జనాదరణని అడ్డం పెట్టుకుని వైసీపీ ఎన్నికల వ్యూహాలు, సాక్షి నడిపించే తీరు మీద కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు తాను కూడా కీలక పాత్ర పోషించాలని అనుకున్నారట. అయితే సాక్షిలో ఎప్పటినుంచో పాతుకుపోయిన సీనియర్ జర్నలిస్టులు, వైసీపీ లో కీలక నేతలు ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో ఆ వెబ్ సైట్ నిన్నటిదాకా జగన్ ని పొగిడిన నోటితోనే ఇపుడు ఆయన భార్యని తెగిడే పనికి పూనుకుంది. కాలం కలిసిరానప్పుడు తాడే పామై కరవడమంటే ఇదే కాబోలు.
మరిన్ని వార్తలు: