టాలీవుడ్‌లో ప్రస్తుతం బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. ఈ క్రమంలోనే బాలకృష్ణ తన తండ్రి బయోపిక్ ‘ఎన్టీఆర్’ను చేస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రెండవ షెడ్యూల్ జరుపుకుంటున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో చంద్రబాబు నాయుడు పాత్రలో రానా మరియు ఏయన్నార్ పాత్రలో సుమంత్ నటిస్తున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇక జయలలిత పాత్రను రకుల్ ప్రీత్ సింగ్, మహానటి సావిత్రి పాత్రను కీర్తి సురేష్‌తో చేయించాలని దర్శకుడు క్రిష్ ప్లాన్ చేశాడు. ఇక ఈ చిత్రంలో అతి కీలకమైన, వివాదాస్పదమైన పాత్ర లక్ష్మీ పార్వతి. ఎన్టీఆర్‌కు రెండవ భార్య అయిన లక్ష్మీ పార్వతిని కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అయినా కూడా ఆమె రెండవ భార్య అయ్యి తీరుతుంది. దాంతో చిత్రంలో ఆమెను చూపించాల్సిందే అంటూ క్రిష్ పట్టుబట్టడంతో బాలయ్య ఓకే చెప్పాడు.
క్రిష్ ఎలాంటి వివాదం లేకుండా, నందమూరి కుటుంబంకు ఇబ్బంది లేకుండా లక్ష్మీ పార్వతి పాత్రను డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. వివాదం లేకుండా, ఆమె పాత్ర హైలైట్ కాకుండా క్రిష్ చూపించాలని భావించిన కారణంగానే బాలకృష్ణ అందుకు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక తాజాగా ఆ పాత్ర కోసం పలువురిని పరిశీలించిన క్రిష్ చివరకు ఆమనిని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. లక్ష్మీ పార్వతి గురించి తెలుగు ప్రజల్లో కాస్త వ్యతిరేకత ఉంది. ఆ కారణంగా ఇద్దరు ముగ్గురు సీనియర్ నటీమణులు నటించేందుకు నో చెప్పారు. అయితే ఆమని మాత్రం లక్ష్మీ పార్వతి పాత్రలో నటించేందుకు ఎలాంటి అడ్డు చెప్పలేదు. ఎలా అయినా నటించేందుకు సిద్దం అంటూ ముందుకు రావడం జరిగిందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో మరెన్ని సంచలనాలు ఉంటాయో చూడాలి.